వినుకొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం...

గుంటూరు//ఏప్రిల్30(ఆకాంక్ష) : ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు అధికారిపైనే మహిళ లైంగికదాడి ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వినుకొండకు చెందిన ఓ మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, సీఐ చిన్న మల్లయ్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.బాధితురాలి కుటుంబం గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఇదే గ్రామానికి చెందిన సీఐ చిన్న మల్లయ్య, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి ప్రాణహాని కలిగిస్తానని బెదిరించి దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించింది.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.