➡️ తొగుట మార్కెట్ ముందు బీఆర్ఎస్ రాస్తారోకో...

సిద్దిపేట//ఏప్రిల్30(ఆకాంక్ష ) : ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తోందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు. తొగుట వ్యవసాయ మార్కెట్‌లో గత 15 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం, మొక్కజొన్న కొనుగోళ్లు నత్తనడకన సాగడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ ముందు నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని మరిచి పోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, యాప్‌ల ద్వారా సరఫరా పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మండు టెండల్లో కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు.రైతు సమస్యలపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని, గతంలో కేసీఆర్ హయాంలో పంట కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళిక ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రైతులు ధాన్యం తీసుకొస్తే గేట్లకు తాళాలు వేయడం ప్రజాపాలన కాదని మాజీ సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి విమర్శించారు.తొగుట మార్కెట్‌లో ఇప్పటికే 4,900 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ రైతులకు చెల్లింపులు జరగలేదని ఆందోళనకారులు ఆరోపించారు. మార్కెట్ ప్రాంగణంలో గత 15 రోజులుగా సుమారు 50 టన్నుల పొద్దుతిరుగుడు ధాన్యం పేరుకు పోయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొనుగోలు లక్ష్యం పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలను ఎలా కొనుగోలు చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యాన్ని బీ గ్రేడ్‌గా కొనుగోలు చేయడం రైతులను మోసం చేయడమేనని నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు సమస్య, యూరియా కొరత, పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ రవికాంత్ రావు ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చర్చల ద్వారా శాంతింపజేశారు. అనంతరం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు గంగసాని రాజిరెడ్డి, బక్క కనకయ్య, నాయకులు సిలివేరి మల్లారెడ్డి, వేల్పుల స్వామి, దోమల కొమురయ్య, సుతారి రమేష్, కుర్మ యాదగిరి, నరేందర్ గౌడ్, మాదాసు అరుణ్ కుమార్, రడం భాస్కర్ గౌడ్, మంగ నరసింహులు, అంజయ్య, భిక్కనూరు శ్రీశైలం, అనిల్ కుమార్, మాదారం ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, సుతారి రాంబాబు, బిక్కనూరి సంతోష్, జహంగీర్, పర్శరాములు, నాగయ్య, మల్లేశం తదితరులతో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.