➡️ చెట్టును ఢీకొన్న కారు, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి గాయాలు...

రాజన్నసిరిసిల్ల//మే01(ఆకాంక్ష) : రుద్రంగి అడవి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.వేములవాడ నుంచి కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కథలాపూర్ మండలానికి చెందిన దీక్షిత్ (37), సహజ (29), నందిని (27)లతో పాటు నలుగురు చిన్నారులు వేములవాడ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో రుద్రంగి అడవి మార్గంలో ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుకు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి మర్రి ప్రశాంత్, పైలట్ తోట నరేందర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అందించారు.అనంతరం గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అడవి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వేగం, నిద్ర మత్తు లేదా వాహన నియంత్రణ కోల్పోవడం కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.