తల్లిప్రేమకు హద్దుల్లేవని నిరూపించిన అనూష... గ్రామాన్ని కంటతడి పెట్టించిన విషాద సంఘటన..

నాగర్‌కర్నూల్//మే01(ఆకాంక్ష) : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కూతుర్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన ఓ తల్లి చివరకు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారుల పరిస్థితి స్థానికులను కలచివేసింది.వెల్టూరు గ్రామానికి చెందిన అనూష(35) భర్త ఐదేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె కూలీ పనులు చేస్తూ తన ఇద్దరు కుమార్తెలు ధనలక్ష్మీ(12), అక్షిత (10)లను ఎంతో కష్టపడి పోషిస్తోంది. కుటుంబానికి ఆధారంగా నిలిచిన అనూష, పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ జీవనం సాగిస్తోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పిల్లలకు ఈత నేర్పించాలని అనూష నిర్ణయించుకుంది. గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్లింది. చిన్న కుమార్తె అక్షితకు ఈత రాకపోవడంతో జాగ్రత్త చర్యగా ఆమె నడుముకు ఖాళీ కూల్‌డ్రింక్ బాటిళ్లు కట్టి నీటిలోకి దింపింది.ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగినప్పటికీ, కొద్దిసేపటికే అక్షిత భయంతో ఏడవడం ప్రారంభించింది. నీటిలో అసౌకర్యంగా అనిపించడంతో గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. కూతురు నీటిలో మునిగి పోతుందేమోనని అనూష తీవ్ర ఆందోళనకు గురైంది.తనకు ఈత రాకపోయినా, కూతుర్ని కాపాడాలనే ఆతృతతో ఒక్కసారిగా నీటిలోకి దూకింది. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ఆమె సమతుల్యత కోల్పోయింది. ఈత తెలియకపోవడంతో నీటిలో కొట్టుమిట్టాడుతూ చివరకు మునిగిపోయింది.ఈ దృశ్యాన్ని చూసిన పెద్ద కుమార్తె ధనలక్ష్మీ తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని రైతులకు సమాచారం అందించింది. విషయం తెలిసిన రైతులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.నీటిలో కూల్‌డ్రింక్ బాటిళ్ల సాయంతో తేలియాడుతున్న అక్షితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం అనూష కోసం నీటిలో గాలింపు చేపట్టగా, కొంతసేపటి తర్వాత ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ ఘటనతో వెల్టూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తను కోల్పోయి పిల్లల కోసం కష్టపడి బతికిన అనూష, చివరకు అదే పిల్లను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.తల్లి దండ్రులు ఇద్దరూ లేకపోవడంతో ధనలక్ష్మీ, అక్షితలు అనాథలుగా మారారు. చిన్నారుల భవిష్యత్తుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉండటంతో ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి పిల్లలకు సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. తన ప్రాణాలకంటే పిల్లల ప్రాణాలకే ప్రాధాన్యం ఇచ్చిన అనూష కథ గ్రామస్తుల మనసులను కలచివేస్తోంది.