భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం...

విజయవాడ//మే01((ఆకాంక్ష) : ప్రేమతో మొదలైన కుటుంబ జీవితం చివరకు విషాదాంతానికి దారితీసిన హృదయ విదారక ఘటన విజయవాడలో కలకలం రేపింది. తల్లి వివాహేతర సంబంధం, ప్రియుడి క్రూరత్వం మధ్య 18 నెలల చిన్నారి అమాయక ప్రాణం బలైన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుటుంబ బంధాలను, మానవత్వాన్ని మరిచిపోయిన ఈ ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ గన్నవరానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు, 18 నెలల పాప హర్షిత ఉన్నారు. బయటకు చూస్తే సాధారణ కుటుంబంలా కనిపించినా, అంతర్గతంగా విభేదాలు పెరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో మహిళకు భర్త స్నేహితుడు కనిజం వంశీతో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో మహిళ విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో అద్దె గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పుట్టింటికి వెళ్తున్నానని ఇంటి వారిని నమ్మించి తరచూ అక్కడికి వెళ్లి వంశీతో గడిపేదని దర్యాప్తులో తేలింది.అయితే రోజులాగే మహిళ తన 18 నెలల కుమార్తె హర్షితను తీసుకుని వంశీ వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో కోపంతో ఊగిపోయిన వంశీ చిన్నారిని గోడకేసి బలంగా కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప మృతి చెందడంతో మహిళ తీవ్ర భయాందోళనకు గురై కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. హర్షిత నాడీ కొట్టుకోవడం లేదని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన మహిళ అనంతరం పాప చనిపోయిందని తెలిపింది.అయితే ఆమె చెప్పిన వివరాల్లో స్పష్టత లేకపోవడం, ఎక్కడ ఉన్నావని అడిగితే పొంతనలేని సమాధానాలు ఇవ్వడం కుటుంబ సభ్యుల్లో అనుమానాలకు తావిచ్చింది. దీంతో వారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. చివరకు చుట్టుగుంట సమీపంలో చిన్నారి మృతదేహంతో మహిళ, వంశీ కనిపించడంతో కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డుగా మారిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రియుడు వంశీపై గతంలో పోక్సో కేసు నమోదైందని, ఆ కేసులో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం.ఒక తల్లి నిర్లక్ష్యం, ప్రియుడి క్రూరత్వం కారణంగా అమాయక చిన్నారి ప్రాణం కోల్పోవడం స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. చిన్నారి మృతి వార్త తెలిసి కాలనీ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.ప్రేమ, బంధాలు, బాధ్యతల మధ్య మానవత్వం కోల్పోతే ఎంతటి విషాదం జరుగుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.