➡️ ఇంటి ఆవరణలోనే మృతదేహాలు పూడ్చిపెట్టిన ఘోరం...

కేరళ//మే01(ఆకాంక్ష) : కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన కన్నతల్లి, సోదరుడిని కిరాతకంగా హత్య చేసి,వారి మృతదేహాలను ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, పొన్నూట్టిల్ కుటుంబానికి చెందిన సజీ (45) తన తమ్ముడు రెజీ (40), తల్లి మేరీకుట్టి (65)తో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబానికి చెందిన సుమారు ఎకరం భూమి పంచుకోవడంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం జరిగిన ఘర్షణ ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది.ఒక రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన రెజీతో సజీకి మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన సజీ తమ్ముడిపై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. అనంతరం టవల్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తల్లి మేరీకుట్టిని కూడా నిందితుడు హతమార్చినట్లు సమాచారం.హత్య అనంతరం రెండు రోజుల పాటు మృత దేహాలను ఇంట్లోనే దాచిపెట్టిన సజీ, తర్వాత ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. నెల రోజులుగా తల్లి,తమ్ముడు కనిపించక పోవడంతో స్థానికులు సజీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి చేరుకోగానే సజీ అక్కడి నుంచి పరారయ్యాడు. అనుమానాస్పదంగా కనిపించిన ఇంటి ఆవరణను పరిశీలించిన పోలీసులు తవ్వకాలు చేపట్టగా పూడ్చిపెట్టిన మృతదేహాలు బయటపడ్డాయి. అనంతరం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడిని ఈ నెల 28న అరెస్ట్ చేశాయి. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, 2018లో సజీ తండ్రి మాథ్యూ అదృశ్యమైన ఘటనతో ఈ కేసుకు సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ ఆస్తి వివాదం చివరకు ద్వంద్వ హత్యలకు దారితీసిన ఈ ఘటన కేరళలో సంచలనం రేపుతోంది.