హయత్‌నగర్‌లో పెట్రోల్ బంక్‌లో మోసం..

హైదరాబాద్//మే01(ఆకాంక్ష ) : హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఓ హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో వినియోగదారుడికి మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన కారుకు ఉన్న పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యానికి మించి ఇంధనం నింపి బిల్లు వేశారని ఓ వినియోగదారుడు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి వివరాల ప్రకారం, తన కారుకు గరిష్టంగా 27 లీటర్ల వరకు మాత్రమే పెట్రోల్ పట్టే సామర్థ్యం ఉండగా, పెట్రోల్ బంక్ సిబ్బంది 32 లీటర్ల పెట్రోల్ నింపినట్లు రసీదు ఇచ్చారని తెలిపాడు. ఈ విషయాన్ని గుర్తించిన అనంతరం బంక్ సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించాడు.ఈ ఘటనపై వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేస్తూ బంక్ వద్దే నిరసన తెలిపినట్లు సమాచారం. అనంతరం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, పెట్రోల్ బంక్‌లోని సీసీటీవీ ఫుటేజీలు, బిల్లింగ్ వివరాలు, మీటర్ పనితీరును పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో ఇంధన బంక్‌లలో వినియోగదారుల నమ్మకంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.