టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితతో కీలక భేటీ...

హైదరాబాద్//మే01(ఆకాంక్ష) : మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ పరిణామాలు, సింగరేణి ప్రాంతంలో పార్టీ విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.త్వరలోనే తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో అధికారికంగా చేరనున్నట్లు బోడ జనార్దన్ వెల్లడించారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పార్టీకి బలమైన స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ సమస్యల పరిష్కారం, కార్మిక వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ వేదికగా పని చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి చెందిన బోడ జనార్దన్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.బోడ జనార్దన్ టీఆర్ఎస్‌లో చేరికతో సింగరేణి బెల్ట్ ప్రాంత రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా కార్మిక వర్గాల్లో ప్రభావం కలిగిన నాయకుడు పార్టీలో చేరడం టీఆర్ఎస్‌కు రాజకీయంగా బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.