– ఆరుగురు మృతి, బాలిక పరిస్థితి విషమం...

రంగారెడ్డి//, మే01(ఆకాంక్ష) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.పోలీసుల వివరాల ప్రకారం..శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ గేట్‌-16 వద్ద రోడ్డుపై నిలిపివున్న లారిని వెనుక నుంచి వేగంగా వచ్చిన టీఎస్‌ 23 ఎఫ్‌ 2298 నంబర్‌ గల కారు ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా లారీ వెనుక భాగంలో ఇరుక్కు పోయింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ వెనుక భాగంలో చిక్కుకున్న కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.