డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం...

నిజామాబాద్//మే01(ఆకాంక్ష) : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల ఆగ్రహం వ్యక్తమైంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉంచినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ భర్త మఠంల శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకుని ప్రమాదం తప్పించారు.bఅనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ రోడ్డుపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న పంటను వెంటనే తీసుకోవాలని కోరారు.రైతుల నిరసనతో ఎల్లారెడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవగా, ధాన్యం కొనుగోలు సమస్యపై రైతుల్లో ఆగ్రహం మరింత పెరుగుతోంది.