విజయ్ రాజకీయ ఎంట్రీతో సమీకరణాల మార్పు... — అధికారానికి చేరువలో టీవీకే విజయన్...

చెన్నై, మే 4: తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీ సంచలనం నమోదవుతోంది. హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కగజం (TVK) పార్టీ అనూహ్యంగా ముందంజలో దూసుకెళ్తోంది. తాజా ఫలితాల ప్రకారం టీవీకే ఇప్పటికే 103 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా, వంద మార్క్‌ను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసింది. ఎడప్పాడి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మాత్రమే మద్దతు ప్రకటించిన ఈ పార్టీ, ఇప్పుడు ప్రధాన పార్టీలకు గట్టి పోటీగా నిలిచింది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సాంప్రదాయ రాజకీయ శక్తులకు టీవీకే పెద్ద సవాల్‌గా మారింది.ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తమ అభ్యర్థులను కాపాడుకోవడం కోసం టీవీకే ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. మల్లాపురం సమీపంలోని పుంజేరి ప్రైవేట్ రిసార్ట్‌ను సుమారు వందమంది ఎమ్మెల్యేల కోసం ముందుగానే బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా, టీవీకే చీఫ్ విజయ్ పార్టీ అభ్యర్థులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తాజా పరిస్థితులపై ఆయనను అప్రమత్తం చేయగా, ఎమ్మెల్యేల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుడు అదవ అర్జున సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఒకచోట చేర్చే పనిలో నిమగ్నమయ్యారు.మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుండగా, తుది ఫలితాలు ఎలా ఉండబోతాయన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.