ఒక్కసారిగా వీచిన గాలికి చెల్లాచెదురైన ఏర్పాట్లు.... మరికొద్దిసేపట్లో భూమి పూజకు రానున్న డిప్యూటీ సీఎం భట్టి...

రాజన్నసిరిసిల్ల//మే05(ఆకాంక్ష) : రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో నిర్వహించనున్న బయో స్ట్రాటమ్ గ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం ముందు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, అలంకరణలు ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు కూలిపోవడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.భూమి పూజకు ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్ద అకస్మాత్తుగా గాలి వేగం పెరగడంతో టెంట్లు ఎగిరిపడగా, కొన్ని విగ్రహాలు కూడా కదిలిపోయాయి. ఈ పరిస్థితిలో అక్కడ ఉన్న అర్చకులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి విగ్రహాలు పడిపోకుండా పట్టుకున్నారు.టెంట్లు ఎగిరిపోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు.ఈ ఘటనతో కార్యక్రమం ఏర్పాట్లలో కొంత అంతరాయం కలిగినప్పటికీ, అధికారులు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గాలి తీవ్రత తగ్గిన వెంటనే టెంట్లు, వేదికను మళ్లీ సరిచేసే పనులు ప్రారంభించారు.మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కార్యక్రమానికి హాజరై బయో స్ట్రాటమ్ గ్యాస్ ప్లాంట్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, గాలులు ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.