నేతన్న చౌరస్తాలో బీజేపీ–బీఆర్ఎస్ ఘర్షణ...

సిరిసిల్లటౌన్//మే18(ఆకాంక్ష) :

జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా సోమవారం ఉదయం రాజకీయ ఉద్రిక్తతలకు వేదికైంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఆగ్రహావేశాలకు దిగడంతో చౌరస్తా ప్రాంతం రణరంగంగా మారింది.బీజేపీ నేత బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టగా, కేటీఆర్‌కు సంబంధితంగా ఆరోపణలు చేస్తూ గ్లోబరీనా సంస్థ వ్యవహారంపై బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇరు పార్టీల పిలుపుతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు చేరుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు “బండి సంజయ్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేయగా, బీజేపీ శ్రేణులు “కేటీఆర్ డౌన్ డౌన్” అంటూ ప్రతినినాదాలు చేశారు. పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.చూస్తుండగానే పరిస్థితి అదుపుతప్పి, కార్యకర్తలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులకు దిగారు. నెట్టుకోవడాలు, తోపులాటలు జరగడంతో నేతన్న చౌరస్తా ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరుకోవడంతో స్థానికులు, వ్యాపారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్వయంగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఇరు పార్టీల కార్యకర్తలు వెనక్కి తగ్గక పోవడంతో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు.లాఠీఛార్జ్ అనంతరం ఘర్షణకు దిగిన కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఘటన నేపథ్యంలో నేతన్న చౌరస్తా పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ ఉద్రిక్తతల కారణంగా సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.