– గుట్కా, వాహనాల స్వాధీనం...

నల్లగొండ//మే26(ఆకాంక్ష) :నల్లగొండ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు మంగళవారం ఉదయం విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలను డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షించారు.ఈ ఆపరేషన్‌లో ఏడుగురు సీఐలు, 18 మంది ఎస్సైలు, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పాటు సుమారు 200 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీసులు 10 బృందాలుగా విడిపోయి సతీశ్‌నగర్‌తో పాటు పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.పట్టణంలో సుమారు 360 ఇండ్లలో తనిఖీలు చేపట్టగా, 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10 మంది, బీహార్‌కు చెందిన నలుగురు, హర్యానాకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఒకరు, అస్సాంకు చెందిన ఒకరు ఉన్నారు.తనిఖీల్లో భాగంగా ఇద్దరు రౌడీషీటర్లు, ఐదుగురు ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆరుగురికి గంజా పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు గంజా సేవించినట్లు నిర్ధారణ అయింది.ఇక అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లేని 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని సంబంధిత కేసులు నమోదు చేస్తున్నారు. అదనంగా నాలుగు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.