ఇబ్బందుల్లో కాలనీ వాసులు...

గోదావరిఖని//జూలై29(ఆకాంక్ష). :


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రామగుండం నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ముఖ్యంగా 10వ డివిజన్ పరిధిలోని రాంనగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై భారీగా నీరు నిలిచి పోవడంతో రాంనగర్ ప్రాంతం సముద్రాన్ని తలపిస్తోంది. ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడుతూ కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా 2వ ఇంక్లైన్ మోరీ పూర్తిగా నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోరీలోకి వర్షపు నీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో నీరు వెనక్కి చేరి రాంనగర్ ప్రాంతంలోని ఇళ్లలోకి ప్రవేశించినట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇదిలా ఉండగా, 2వ ఇంక్లైన్ మోరీకి నీరు వెళ్లకుండా సింగరేణి ఆధ్వర్యంలో గోడ నిర్మించడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు సహజంగా మోరీలోకి వెళ్లే మార్గానికి అడ్డంకులు ఏర్పడటంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నీరు రోడ్లపైకి, అక్కడి నుంచి ఇళ్లలోకి చేరుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడుతున్నారు.వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లోని సామగ్రి తడిసిపోవడంతో పాటు నిత్యావసర వస్తువులు దెబ్బతింటున్నాయని కాలనీ వాసులు వాపోయారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.సమాచారం అందుకున్న రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య రాంనగర్‌లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.నీట మునిగిన రహదారులు, ఇళ్లలోకి చేరిన వరద నీటిని పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వర్షపు నీరు నిలిచి పోకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో కాలనీలో నీరు ఇళ్లలోకి చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. 2వ ఇంక్లైన్ మోరీ సమస్యను పరిష్కరించి వర్షపు నీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా ఇళ్లలోకి నీరు చేరకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు.